ఎందరో మహానుభావులు. ఎన్నియో మహానుభవాలు. కష్ట - నష్టములు, కన్నీళ్ళు - కడగండ్లు, అన్నింటినీ దిగమింగి
ఒోర్చి, సహించి, తమ జీవితానుభవ సారాన్ని - సారాంశాన్ని సమస్త మానవాళి కోసం ఉద్భోదించి యున్నారు.
ఆ స్ఫూర్తి, స్పందన, మానవతా విలువలు, సమస్యా పరిష్కారములు జగత్కళ్యాణ కారకాలుగా విలసిల్లి, మానసిక
చైతన్య వికాసం కలిగించి, అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి, మానవాభ్యుదయానికి తార్కాణంగా నిలిచారు.
వారు చెప్పిన ప్రతీ వాక్యం ఒక్కో ఉద్గ్రంధం చదివినంత జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. విద్యార్ధి స్థాయి నుంచి - మేధావుల
స్థాయి వరకూ ఆలోచనలకు పదును బెట్టే కార్యాచరణ పంథాగా మార్గదర్శనం - దిశా నిర్దేశనం చేస్తాయి.
శాంత - ప్రశాంతయుతమైన మనశ్శాంతిని ప్రసాదిస్తాయి. వారి అడుగు జాడల గురుతులు బ్రతుకు బాటలు
పండించుకునే నవ,నవోన్మేష నందనోద్యాన వనాలుగా రూపుదాల్చి, సుమ సౌరభాలు గుబాళింప చేస్తాయి.
ప్రతీ ఒక్కరినీ అలరింప చేస్తాయి. ఆలోచింప చేస్తాయి. విజ్ఞాన - సుజ్ఞాన - ప్రజ్ఞాన కాంతి పుంజములు లోకంలో
నలుదెసలా విస్తరింప చేస్తాయి. మానవత్వాన్ని ఆవిష్కరింప చేస్తాయి. మేధస్సును వికసింప చేస్తాయి.
చతుర్విధావస్థల యందు, చతుర్విధాశ్రమములయందు, చతుర్విధ పురుషార్ధములయందు, చతుర్విధోపాయములుగా
మార్గాంతరములు చూపిస్తూ - వ్యక్తిగత ధర్మాలను, కుటుంబ ధర్మాలను, సామాజిక ధర్మాలను, మానవతా ధర్మాలను,
ప్రాకృతిక ధర్మాలను, కాల ధర్మాలను విశదీకరించి, విపులీకరించి - సకల, సద్విధ, సాత్విక భావాలు నింపి,
అంతర్ముఖుల గావించి, అంతర్మథనం కలిగించి, అంతరాత్మను దర్శింపజేసి, పరమాత్మాన్వేషణం చేసే సత్తా
కలుగ జేస్తారు. మానవ జీవిత సౌభాగ్యాన్ని సుసంపన్నం చేసుకుని, జన్మ సార్ధకత్వాన్ని సాధించ గలుగుతారు.
అందుకే ఈ మహాత్ముల వాక్యాలు మానవత్వ కావ్యాలనడంలో ఎంతమాత్రమూ సందియము లేదు.
నైతిక విలువలు పతనావస్థకు దిగజారకముందే తల్లి,దండ్రులు - తమ పిల్లలను బాల్యావస్థ నుండి, వారి నడవడికను
తీర్చిదిద్దాలి. మహాత్ముల వాక్యాలను విడమరచి చెప్పి, వారిని సత్ప్రవర్తనాపరులుగా తీర్చిదిద్దాలి. అదే మీ పిల్లలకు
మీరిచ్చే నిజమైన ఆస్థి. అదే తల్లి,దండ్రుల గురుతర బాధ్యత కూడా.
23, సెప్టెంబర్ 2009, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి