వేద,వేదాంగ - ఉపనిషత్ - వేదాంతములు, శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ప్రబంధ, కావ్యములు -
మానవ సృష్టికి, మానవ చరిత్రకు పునాది. విద్యతో, విజ్ఞానంతో, విచక్షణా జ్ఞానంతో, జన్మ సంస్కారంతో
మానవులు నూటికి నూరుపాళ్ళు తన దైనందిన ధర్మాన్ని మనో వాక్కాయ కర్మణా ఆచరిస్తూ, అందమైన
మానవత్వ సౌధాలను నిర్మించుకోవాలి. ఇది దైవాదేశం. ఇది తప్పరానిది. సృష్ట్ర్యారంభానికి ముందే
సృష్టి కర్త నిర్ణయించింది. ఏది తప్పు - ఏది ఒప్పు. ఎలా ఉండాలి. ఎలా ఉండకూడదు. ఏది ఆచరించాలి.
ఏది ఆచరించకూడదు. ఏది పాటించాలి. ఏది పాటించకూడదు. అన్న వాటిని శాసించాడు. దానిని
ప్రతిఘటించడం సృష్టి వినాశనానికే దారి తీస్తుంది. భగవదాగ్రహానికి గురి కావడం ఎంత మాత్రమూ
శ్రేయస్కరం కాదు. ఆయన పాలన సర్వే సర్వత్రా ధర్మబద్ధమైనదిగానే ఉండాలి. దీనికి తిరుగు లేదు.
సృష్టి సరిగ్గా సాగాలంటే, సజావుగా ఉండాలంటే ధర్మ బద్ధమైన ప్రవర్తన మానవులకు అత్యంతావశ్యకం.
ఎదిరించి చేటు తెచ్చుకోవటం పరమ మూర్ఖత్వం. అందుకే తనకు మారుగా మనల్ని అన్ని విధాలుగా
సంస్కరించడం కోసం ఎందరో దైవ ప్రతినిధులను, దైవాంశ సంభూతులను ఈ భూమి పైకి పంపించాడు.
ఆ మహానుభావులు, ఆ మహోన్నతులు, ఆ మహితాత్ములు, ఆ మహాత్ములు భగవత్ సందేశాలను
అనేకవిధాలుగా - అనేక రూపాలుగా - అనేక సందర్భాలలో సమయోచితంగా ఉద్భోదించారు.
మహర్షుల రూపంలో, యతుల రూపంలో, సాధు పుంగవుల రూపంలో, మునీశ్వరుల రూపంలో,
వేదాంత దేశికుల రూపంలో, తత్వవేత్తల రూపంలో, పురోహితుల రూపంలో, పండితుల రూపంలో,
కవుల రూపంలో, కళాకారుల రూపంలో ఈ భువిపై జన్మించి, సంస్కారాలను సుబోధక మొనరించారు.
మానవాళిని తీర్చిదిద్దారు. ధర్మాన్ని నాలుగు పాదాలా నిలిపారు. కానీ, సృష్టి క్రమంలో, కాల గమనంలో,
కాల గర్భంలో యుగాలు అంతరించి, ఆవిర్భవిస్తున్నప్పుడల్లా దైవదత్తమైన మానవాతీత శక్తులు సాధించుకున్న
కొందరు అతి తెలివి మూర్ఖులు రాక్షసులుగా తయారై, అతిశయంతో, గర్వాహంకారాంధతన సాటి మానవులకు
కీడు కలిగిస్తూ, పైశాచికానందాన్నిపొందుతూ, ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు. ఇది ఎవ్వరూ క్షమించలేని
భగవదాపరాధం. దండనార్హం. దానికి వారు మూల్యం చెల్లించాల్సిందే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి