మానవులం మనం అంతదాకా ఎందుకు తెచ్చుకోవాలి. తెగేదాకా తాడు ఎందుకు లాగాలి. మానసిక
కాలుష్యంతో, మితిమీరిన స్వార్ధంతో, కక్కుర్తితో, ఎంతమందినైనా సరే, మోసం చేసో, దగా చేసో, నమ్మక
ద్రోహం చేసో, బల పరాక్రమాలుపయోగించో, అందరికీ సమానంగా అందల్సిన ప్రాకృతిక సంపద తానొక్కడే
అధికంగా అనుభవించాలని, రారాజులుగా చెలామణీ అవ్వాలని ఆశిస్తూ, విర్రవీగుతున్నారు. ఇదెంత
పనికిమాలిన, తనకుమాలిన, తెలివి తక్కువ ఆలోచన. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే.
ప్రాకృతిక సంపదను అనుభవించడానికి అందరూ సమాన భాగస్థులే. మరెందుకింత వైరం - వైషమ్యం -
వైమనస్యం - వైపరీత్యం. తాజెడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్లు - ఇటుబవంటి పాపాన్ని అందరికీ
అంటిస్తున్నాడు. ఒకడ్ని చూచి ఇంకొకడు అనుకరిస్తున్నాడు. ఫలితం - సృష్చి వైఫల్యం - సృష్టి సమతౌల్యత
తప్పడం. సృష్టికి విఘాతం. తన సృష్టిని పాడుచేస్తుంటే భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా.
చెమడాలు వలిచేస్తాడు. ఈ సృష్టి - సమస్త జీవరాశి నిర్మాణం - గ్రహ గతులు - పంచ భూతాలు క్రమ పద్ధతిలో
అమర్చి, అవి సంచరించే విధానం రూపొందించడానికి భగవంతునికి కోటాను,కోట్ల సంవత్సరాలు పట్టింది.
మన వస్తువును పాడు చేస్తే మనం ఊరుకుంటామా. భగవంతుడూ అంతే. క్షమ కొంత వరకే. పురాకృత
ప్రారబ్ధ గత పాప పుణ్య కర్మలు లెక్కలు సరి చూస్తాడు. గురి చేస్తాడు సరి చేయడానికి. యుగాలు మారి,మారి
కలియుగం ప్రారంభమైన నాటి నుండి ధర్మం గతి తప్పుతూనే ఉంది. ఒంటి కాలిపై నడవడానిక్కూడా
ఓపిక లేక, చతికిల బడి పోతోంది ధర్మదేవత. మానవుడు అంతగా దిగజారి పోయాడు. ప్రకృతి మాత
నిత్యమూ, నిరంతరమూ రోదిస్తూనే ఉంది. ఆక్రోశిస్తూనే ఉంది. ఇంత భయంకర విషమ పరిస్థితులు
సృష్టించుకున్న మానవ అకృత్యాలకు పరిష్కారం ఏమిటి.
ఇకనైనా పరిస్థితులు గమనించి, నిజాలను గ్రహించి, మనలను మనం సంస్కరించుకోవడమొక్కటే
పరిష్కార మార్గం. స్వార్ధం, కక్కుర్తి, ఈర్య, మానసిక కాలుష్యం లేని విధంగా - కనీసం మన పిల్లలనైనా
మనం సంస్కరించుకుందాం. వారితో వీలైనంత ఎక్కువ సమయం గడుపుదాం. వారికి వచ్చే అనేకానేక
ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు తెలుసుకుంటూ, సరియైన సమాధానాలతో సంతృప్తి పరుస్తూ,
ధర్మ మార్గాన్ని ఉపదేశిస్తూ, రానున్న తరాన్నైనా స్వచ్ఛంగా - పారదర్శకంగా - ఆదర్శంగా తీర్చిదిద్దుదాం.
వారికి మంచి భవితవ్యాన్ని నిర్మిద్దాం. భగవంతుని కృపకు పాత్రులమవ్నుదాం. అదే నేడు భగవంతునికి
కృతజ్ఞతా పూర్వకంగా మనం సమర్పించే సత్సంకల్ప, సదాచార, సత్సంస్కార మానస పూజా పుష్పాంజలి.
అందుకే ఈ మహాత్ముల వాక్యాలు - మానవత్వ కావ్యాలు అన్న రచనకు రూపకల్పన జరిగింది.
వీటిని అర్ధం చేసుకొని, మీ పిల్లలకు సవివరంగా, వివరించి, వారి భవితను తీర్చిదిద్దండి.
తల్లిదండ్రులారా . . . నా ఈ ప్రయత్నానికి ఊపిరి పోయండి. అదే నా ఆశ - ఆశయం -
ఈ బ్లాగు నిర్మాణం వెనుక నున్న కృషికి ఫలం .. ఫలితం ... సార్ధకత్వం ...విన్నపమూ కూడా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి