13, అక్టోబర్ 2009, మంగళవారం

స్వామి వివేకానంద

1. ఒక దేశంలో మనుష్యులు ఎంత గొప్పవారైతే, ఆ దేశం అంత గొప్పదవుతుంది. ఒక దేశం దిగజారి పోయిందంటే దానికి అర్ధం ఆ సమాజం గొప్ప వ్యక్తులను తయారు చెయ్యలేక పోతోందనే.

2. ప్రతీదీ కావాలనుకునే వాడు దేనినీ పొందలేడు.

3. తల్లిని ఆరాధించని వ్యక్తి ఉన్నతి పొందలేడు. నా ధీశక్తి యావత్తుకూ కారకురాలు నా తల్లే.

4. అదృష్టమనేది ఒక లాటరీ వంటిది. నీవు దానిని కోరినప్పుడు అది నిన్ను విడిచి పారిపోతుంది. నీవు దాని పట్ల విముఖత చూపినప్పుడు అది నిన్ను కౌగలించుకుంటుంది.

5. మనలను యదార్ధమైన మనిషిగా రూపొందించడానికి అవసరమైన విచక్షణా జ్ఞానమూ, సమాజ శ్రేయస్సు కోసం కావలసిన చైతన్యాలను అందించే తత్వమూ, మతమూ నేడు అవసరం.

6. మీ రక్త నాళాలలో ప్రవహిస్తున్నది గొప్ప మహర్షుల రక్తం అని మీరెల్లప్పుడూ గుర్తుంచుకోండి.

7. ఎన్ని అవరోధాలెదురైనా అనుకున్న పని మీద నుంచి దృష్టి మరలిపోకుండా పనిచేయగలిగిన వాడి వ్యక్తిత్వమే ఉన్నతమైనది.

8. పౌరుషంతో పనిచెయ్యనప్పుడు ఎంతమంది దేవుళ్ళనుంచి ఎంత సహాయం అందినా అది మీలోని జడత్వాన్ని, సోమరితనాన్ని వదిలించలేవు.

9. నిజానికి జీవితం అంటే ఇవ్వడమే గానీ, తీసుకోవడం కాదు.

10. సరిగా మాట్లాడటాన్ని నేర్చుకోవడమే, వ్యక్తిత్వ నిర్మాణంలో అతి ముఖ్యమైన అంశం.

11. ఏది ఏమైనా మనిషి స్వభావంలో ఒక గప్ప అపాయం ఉంది. అదేమంటే, మనిషి ఎప్పటికీ తనను తాను పరీక్షించుకోకపోవటమే.

12. కోపం మహా పాపం. అది ఒక్కోసారి ధర్మబద్ధంగా కనిపించినా సరే, కోపం అనేది అన్ని రూపాలలోనూ పాపమే.

13. బాధ్యత అంతా మీ భుజాలమీదే ఉందని అనుకోండి. అప్పుడే మీరు అత్యుత్తమంగా పనిచేయగలుగుతారు.

14. ఏ వ్యక్తి అయితే తానున్న కాలానికంటే సుదూరమైన భవిష్యత్తులోకి తొంగి చూస్తాడో, దానికి తగినట్టుగా ఆలోచించి పనిచేస్తారో, అటువంటి వాడు మాత్రమే గొప్ప కార్యాలు సాధించగలుగుతాడు.

8, అక్టోబర్ 2009, గురువారం

మహాత్మా గాంధీ

1. కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారం లోకి నెట్టి వేస్తుంది.

2. మొదట వారు మిమ్మల్ని (మహిళల్ని ఉద్దేశించి) పట్టించుకోరు. తర్వాత మిమ్మల్ని చూచి నవ్వుతారు.
ఆ తర్వాత మీతో పోరాడుతారు. చివరకు మీరే గెలుస్తారు.

3. మానవుల అవసరాలను తీర్చడానికి ప్రపంచంలో పుష్కలంగా వనరులున్నాయి. కాని అత్యాశపరమైన
కోరికలు తీర్చాలంటే మాత్రం ఎన్ని వనరులున్నా చాలవు.

4. ప్రతి పని వల్లా సంతోషం రాదు. కానీ పని చేయకుండా ఉంటే ఎలాంటి ఆనందం కలుగదు.

5. ప్రేమకు ఎల్లలు, హద్దులు ఉండవు. సర్వ మానవాళి శ్రేయస్సే ప్రేమ ధ్యేయము.

6. ఎప్పుడూ సత్యం, ప్రేమలను విడిచి పెట్టవద్దు.

7. నా జీవితమే నా సందేశం.

8. సత్యమే భగవంతుడు. భగవంతుడంటేనే సత్యం.

9. ప్రేమ లేకపోతే మనిషి గమనంలో జీవం లేనట్లే.

10. మనిషిలో దయ, ఔదర్యాలకు చిహ్నంగా మనిషిని తీర్చిదిద్దేది ప్రేమ తత్వమే.
ప్రేమ రాహిత్యాన్ని మించిన జబ్బు మరొకటిలేదు.

11. ఈ ప్రపంచం ప్రేమ బంధంలో కలిసి ఉంటుంది. ప్రేమ సంఘటనలను, సేవలను రోజు వారీ
లెక్కలుగా చరిత్ర గణించలేదు. చరిత్ర కేవలం ఘర్షణలను, వివాదాలను మాత్రమే గణించగలదు.

12. మనుషులు తామెట్లా ఉన్నామని నమ్ముతుంటారో, అలానే పరిణమిస్తారు. నేనొక పని చెయ్యలేనని నమ్ముతున్నట్లయితే, నిజంగానే నాకా పని అసాధ్యమయిపోతుంది. కానీ నేనే గనుక నాకది సాధ్యమని నమ్మానా, అప్పుడు దాన్ని సాధించగలిగే శక్తి నాకు మొదట్లో లేకపోయినా నేనా శక్తిని ఎప్పటికయినా సాధించుకోగలుగుతాను.

13. అత్యంత బలమైన ఆయుధం అహింస.

14. అహింస అనేది సర్వ ప్రాణులకు మేలుకోరే మాతృమూర్తి వంటిది.

15. శక్తి భౌతిక సామర్ధ్ర్యం నుంచి రాదు. దృఢ దీక్ష నుంచి అజేయ శక్తి జనిస్తుంది.

16. ప్రార్ధన ఉదయం తలుపులు తీసే తాళంచెవి. సాయంత్రం తలుపులు మూసే గొళ్ళెం.

17. పుట్టుకతోనే పిల్లల విద్యభ్యాసం ప్రారంభం అవుతుంది.

18. కోట్లాది ప్రజల కందని కలిమిని, సుఖమును అనుభవింపకుము. పట్టుదలతో నిరాకరింపుము. ఇదియే ధర్మము.

19. కోపం, అసహనం మంచి అవగాహనకు బద్ధ శతృవులు.

20. నీ మాటను, క్రియను శాంతి మార్గం వైపు మళ్ళించు. నీ ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటే ప్రతి పనీ ఉన్నతమవుతుంది.

21. ఎవ్వరితోనూ అతి స్నేహం పనికిరాదు. మైత్రిని కోరుకునే వాడు అందరితోనూ చెలిమి చేయాలి.

22. నాకు పరమాత్మ అంటే సత్యం, ప్రేమ. పరమాత్మ అంటే నీతి,నిర్భయం,జీవనసారం, వెలుగు, అంతరాత్మ. ఆయన హృదయాన్వేషి. మానవులందరికీ ఆయనే అన్నీ. ఆయన మనలో ఉన్నాడు. మనతో పాటే మనకు అతీతంగా ఉన్నాడు.

23. అన్ని మతాలు మానవత్వాన్ని పెంపొందించేందుకు ఉన్నవే. సర్వ మతాల సారం - మానవ జాతి సముద్ధరణే.

24. ప్పపంచ మానవాళి మొత్తం ఐకమత్యంతో, శాంతి, సౌభ్రాతృత్వాలతో మెలగాలి. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడ మానవత్వం కనిపిస్తుందో అక్కడ పరమాత్మ కనిపిస్తాడు. ఎక్కడ మతసహనం వెల్లివిరుస్తుందో అక్కడ దైవం సాక్షాత్కరిస్తుంది.

25. నా మతం సర్వ ధర్మ సంభవం. వసుధైక కుటుంబమే నా లక్ష్యం.

26. నా జీవితం భౌతిక వేదనలతో నిండినప్పుడు, మరువలేని దుర్ఘటనలు నన్ను ముంచినప్పడు, భగవద్గీతే నాకు ప్రేరణ. అదే నాలోని నిరుత్సాహాన్ని పోగెట్టి, చిరునవ్వును తెప్పించేది.

27. గాలీ, నీరు లేకుండా జీవించగలమేమో గానీ, పరమాత్మ లేకుండా జీవించలేనని తెలుసుకున్నాను. మన చుట్టూ ఉన్నవి అన్నీ నిరంతరం రూపాంతరం చెందుతూనే ఉంటాయి. కానీ పరమాత్మ శక్తిలో ఎలాంటి మార్పు ఉండదు.

28. వివిధ మతాలన్నీ ఒకే పూలతోటలోని వేర్వేరు మొక్కలకు పూచిన వేర్వేరు పువ్వుల వంటివి.

29. భగవంతుడికి మతం లేదు. ఈశ్వరుడే అల్లా. అల్లాయే ఈశ్వరుడు.

30. చిత్త శుద్ధితో, సంపూర్ణ విశ్వాసంతో భగవద్గీతను పఠించే వ్యక్తికి ఆశాభంగం ఉండదు. అతడు శాశ్వత ఆనందాన్ని పొందుతాడు.

31. సత్యాన్వేషణే భగవంతుని అన్వేషణ. సత్యాన్ని దర్శించడమంటే దేవుడిని దర్శించడమే. నా ఉద్దేశ్యంలో దేవుడు సత్యం కాదు. సత్యమే దైవం. సత్యాన్ని భగవంతుడిగా అనుసరించని మానవ జీవితం అర్ధం లేనిది.

32. ప్రార్ధన అంటే కేవలం పెదవులతో ఉచ్ఛరించేది మాత్రమే కాదు. ఎలాంటి విద్వేషాలు లేకుండా మన హృదయాలను ప్రక్షాళన చేసుకోవడమే నిజమైన ప్రార్ధన.

33. పరమేశ్వరుని వ్యాఖ్యలు అనేకం. గొప్పదనాలు కూడా అనన్యం. నేను సత్య స్వరూపుడైన పరమేశ్వరుని వూజారిని. అతనొక్కడే సత్యం. మిగిలినవన్నీ మిథ్యయే.

34. తప్పు చేయడం మానవ సహజం. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చెందడం ఉత్తముల లక్షణం. అందుకు భిన్నంగా తాను చేసిన తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం అధః పాతాళానికి చేరుకునే ప్రయత్నమే కాగలదు.

35. తన ధ్యేయాన్ని సాధించాలనే ఏకైక లక్ష్యంతో, దాని పైనే మనసు పెట్టి, కృషి చెయ్యడమే ప్రార్ధన.

36. సత్యం యొక్క నిరంతరాన్వేషణే హిందూ ధర్మ తత్వం.

37. ప్రతి ప్రయోగంలోనూ అపాయం దాగి ఉంటుంది. అలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాలి. తీసుకున్న ప్రతి నిర్ణయం, చేసే ప్రతి ప్రయత్నం వాటిని (అపాయాలను) తప్పించేలా ఉండాలి.

38. నీ జీవితాన్ని నువ్నే చక్కదిద్దుకోవాలి గానీ, ఎవరో వచ్చి సరిదిద్దుతారని భావించడం సరి కాదు.

39. నీ ప్రయత్నాలను అడ్డుకునే వారి నుంచి జాగ్రత్త పడటం తప్పని సరి. అందుకోసం నీకుగా నువ్వు ఆలోచించడం నేర్చుకోవాలి. నీకుగా నువ్వు ప్రయత్నాలు ప్రారంభించాలి. ఇదే అభివృద్ధికి తారకమంత్రంగా మారాలి.

40. శక్తి శారీరక దారుఢ్యం నుంచి రాదు. చెరిగిపోని సంకల్ప బలం నుంచి వస్తుంది.


4, అక్టోబర్ 2009, ఆదివారం

మహాత్ములు - నైతిక విలువలు - 3

దుష్ట శిక్షణ - శిష్ట రక్షణ తకోసం తానే దిగి వస్తాడు. పరిస్తితులు చక్కబరచడానికి. బుద్భుద ప్రాయులైన
మానవులం మనం అంతదాకా ఎందుకు తెచ్చుకోవాలి. తెగేదాకా తాడు ఎందుకు లాగాలి. మానసిక
కాలుష్యంతో, మితిమీరిన స్వార్ధంతో, కక్కుర్తితో, ఎంతమందినైనా సరే, మోసం చేసో, దగా చేసో, నమ్మక
ద్రోహం చేసో, బల పరాక్రమాలుపయోగించో, అందరికీ సమానంగా అందల్సిన ప్రాకృతిక సంపద తానొక్కడే
అధికంగా అనుభవించాలని, రారాజులుగా చెలామణీ అవ్వాలని ఆశిస్తూ, విర్రవీగుతున్నారు. ఇదెంత
పనికిమాలిన, తనకుమాలిన, తెలివి తక్కువ ఆలోచన. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే.
ప్రాకృతిక సంపదను అనుభవించడానికి అందరూ సమాన భాగస్థులే. మరెందుకింత వైరం - వైషమ్యం -
వైమనస్యం - వైపరీత్యం. తాజెడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్లు - ఇటుబవంటి పాపాన్ని అందరికీ
అంటిస్తున్నాడు. ఒకడ్ని చూచి ఇంకొకడు అనుకరిస్తున్నాడు. ఫలితం - సృష్చి వైఫల్యం - సృష్టి సమతౌల్యత
తప్పడం. సృష్టికి విఘాతం. తన సృష్టిని పాడుచేస్తుంటే భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా.
చెమడాలు వలిచేస్తాడు. ఈ సృష్టి - సమస్త జీవరాశి నిర్మాణం - గ్రహ గతులు - పంచ భూతాలు క్రమ పద్ధతిలో
అమర్చి, అవి సంచరించే విధానం రూపొందించడానికి భగవంతునికి కోటాను,కోట్ల సంవత్సరాలు పట్టింది.
మన వస్తువును పాడు చేస్తే మనం ఊరుకుంటామా. భగవంతుడూ అంతే. క్షమ కొంత వరకే. పురాకృత
ప్రారబ్ధ గత పాప పుణ్య కర్మలు లెక్కలు సరి చూస్తాడు. గురి చేస్తాడు సరి చేయడానికి. యుగాలు మారి,మారి
కలియుగం ప్రారంభమైన నాటి నుండి ధర్మం గతి తప్పుతూనే ఉంది. ఒంటి కాలిపై నడవడానిక్కూడా
ఓపిక లేక, చతికిల బడి పోతోంది ధర్మదేవత. మానవుడు అంతగా దిగజారి పోయాడు. ప్రకృతి మాత
నిత్యమూ, నిరంతరమూ రోదిస్తూనే ఉంది. ఆక్రోశిస్తూనే ఉంది. ఇంత భయంకర విషమ పరిస్థితులు
సృష్టించుకున్న మానవ అకృత్యాలకు పరిష్కారం ఏమిటి.
ఇకనైనా పరిస్థితులు గమనించి, నిజాలను గ్రహించి, మనలను మనం సంస్కరించుకోవడమొక్కటే
పరిష్కార మార్గం. స్వార్ధం, కక్కుర్తి, ఈర్య, మానసిక కాలుష్యం లేని విధంగా - కనీసం మన పిల్లలనైనా
మనం సంస్కరించుకుందాం. వారితో వీలైనంత ఎక్కువ సమయం గడుపుదాం. వారికి వచ్చే అనేకానేక
ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు తెలుసుకుంటూ, సరియైన సమాధానాలతో సంతృప్తి పరుస్తూ,
ధర్మ మార్గాన్ని ఉపదేశిస్తూ, రానున్న తరాన్నైనా స్వచ్ఛంగా - పారదర్శకంగా - ఆదర్శంగా తీర్చిదిద్దుదాం.
వారికి మంచి భవితవ్యాన్ని నిర్మిద్దాం. భగవంతుని కృపకు పాత్రులమవ్నుదాం. అదే నేడు భగవంతునికి
కృతజ్ఞతా పూర్వకంగా మనం సమర్పించే సత్సంకల్ప, సదాచార, సత్సంస్కార మానస పూజా పుష్పాంజలి.
అందుకే ఈ మహాత్ముల వాక్యాలు - మానవత్వ కావ్యాలు అన్న రచనకు రూపకల్పన జరిగింది.
వీటిని అర్ధం చేసుకొని, మీ పిల్లలకు సవివరంగా, వివరించి, వారి భవితను తీర్చిదిద్దండి.
తల్లిదండ్రులారా . . . నా ఈ ప్రయత్నానికి ఊపిరి పోయండి. అదే నా ఆశ - ఆశయం -
ఈ బ్లాగు నిర్మాణం వెనుక నున్న కృషికి ఫలం .. ఫలితం ... సార్ధకత్వం ...విన్నపమూ కూడా.

24, సెప్టెంబర్ 2009, గురువారం

మహాత్ములు - నైతిక విలువలు - 2.

వేద,వేదాంగ - ఉపనిషత్ - వేదాంతములు, శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ప్రబంధ, కావ్యములు -
మానవ సృష్టికి, మానవ చరిత్రకు పునాది. విద్యతో, విజ్ఞానంతో, విచక్షణా జ్ఞానంతో, జన్మ సంస్కారంతో
మానవులు నూటికి నూరుపాళ్ళు తన దైనందిన ధర్మాన్ని మనో వాక్కాయ కర్మణా ఆచరిస్తూ, అందమైన
మానవత్వ సౌధాలను నిర్మించుకోవాలి. ఇది దైవాదేశం. ఇది తప్పరానిది. సృష్ట్ర్యారంభానికి ముందే
సృష్టి కర్త నిర్ణయించింది. ఏది తప్పు - ఏది ఒప్పు. ఎలా ఉండాలి. ఎలా ఉండకూడదు. ఏది ఆచరించాలి.
ఏది ఆచరించకూడదు. ఏది పాటించాలి. ఏది పాటించకూడదు. అన్న వాటిని శాసించాడు. దానిని
ప్రతిఘటించడం సృష్టి వినాశనానికే దారి తీస్తుంది. భగవదాగ్రహానికి గురి కావడం ఎంత మాత్రమూ
శ్రేయస్కరం కాదు. ఆయన పాలన సర్వే సర్వత్రా ధర్మబద్ధమైనదిగానే ఉండాలి. దీనికి తిరుగు లేదు.
సృష్టి సరిగ్గా సాగాలంటే, సజావుగా ఉండాలంటే ధర్మ బద్ధమైన ప్రవర్తన మానవులకు అత్యంతావశ్యకం.
ఎదిరించి చేటు తెచ్చుకోవటం పరమ మూర్ఖత్వం. అందుకే తనకు మారుగా మనల్ని అన్ని విధాలుగా
సంస్కరించడం కోసం ఎందరో దైవ ప్రతినిధులను, దైవాంశ సంభూతులను ఈ భూమి పైకి పంపించాడు.
ఆ మహానుభావులు, ఆ మహోన్నతులు, ఆ మహితాత్ములు, ఆ మహాత్ములు భగవత్ సందేశాలను
అనేకవిధాలుగా - అనేక రూపాలుగా - అనేక సందర్భాలలో సమయోచితంగా ఉద్భోదించారు.
మహర్షుల రూపంలో, యతుల రూపంలో, సాధు పుంగవుల రూపంలో, మునీశ్వరుల రూపంలో,
వేదాంత దేశికుల రూపంలో, తత్వవేత్తల రూపంలో, పురోహితుల రూపంలో, పండితుల రూపంలో,
కవుల రూపంలో, కళాకారుల రూపంలో ఈ భువిపై జన్మించి, సంస్కారాలను సుబోధక మొనరించారు.
మానవాళిని తీర్చిదిద్దారు. ధర్మాన్ని నాలుగు పాదాలా నిలిపారు. కానీ, సృష్టి క్రమంలో, కాల గమనంలో,
కాల గర్భంలో యుగాలు అంతరించి, ఆవిర్భవిస్తున్నప్పుడల్లా దైవదత్తమైన మానవాతీత శక్తులు సాధించుకున్న
కొందరు అతి తెలివి మూర్ఖులు రాక్షసులుగా తయారై, అతిశయంతో, గర్వాహంకారాంధతన సాటి మానవులకు
కీడు కలిగిస్తూ, పైశాచికానందాన్నిపొందుతూ, ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు. ఇది ఎవ్వరూ క్షమించలేని
భగవదాపరాధం. దండనార్హం. దానికి వారు మూల్యం చెల్లించాల్సిందే.
































23, సెప్టెంబర్ 2009, బుధవారం

మహాత్ములు - నైతిక విలువలు - 1

ఎందరో మహానుభావులు. ఎన్నియో మహానుభవాలు. కష్ట - నష్టములు, కన్నీళ్ళు - కడగండ్లు, అన్నింటినీ దిగమింగి
ఒోర్చి, సహించి, తమ జీవితానుభవ సారాన్ని - సారాంశాన్ని సమస్త మానవాళి కోసం ఉద్భోదించి యున్నారు.
ఆ స్ఫూర్తి, స్పందన, మానవతా విలువలు, సమస్యా పరిష్కారములు జగత్కళ్యాణ కారకాలుగా విలసిల్లి, మానసిక
చైతన్య వికాసం కలిగించి, అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి, మానవాభ్యుదయానికి తార్కాణంగా నిలిచారు.
వారు చెప్పిన ప్రతీ వాక్యం ఒక్కో ఉద్గ్రంధం చదివినంత జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. విద్యార్ధి స్థాయి నుంచి - మేధావుల
స్థాయి వరకూ ఆలోచనలకు పదును బెట్టే కార్యాచరణ పంథాగా మార్గదర్శనం - దిశా నిర్దేశనం చేస్తాయి.
శాంత - ప్రశాంతయుతమైన మనశ్శాంతిని ప్రసాదిస్తాయి. వారి అడుగు జాడల గురుతులు బ్రతుకు బాటలు
పండించుకునే నవ,నవోన్మేష నందనోద్యాన వనాలుగా రూపుదాల్చి, సుమ సౌరభాలు గుబాళింప చేస్తాయి.
ప్రతీ ఒక్కరినీ అలరింప చేస్తాయి. ఆలోచింప చేస్తాయి. విజ్ఞాన - సుజ్ఞాన - ప్రజ్ఞాన కాంతి పుంజములు లోకంలో
నలుదెసలా విస్తరింప చేస్తాయి. మానవత్వాన్ని ఆవిష్కరింప చేస్తాయి. మేధస్సును వికసింప చేస్తాయి.
చతుర్విధావస్థల యందు, చతుర్విధాశ్రమములయందు, చతుర్విధ పురుషార్ధములయందు, చతుర్విధోపాయములుగా
మార్గాంతరములు చూపిస్తూ - వ్యక్తిగత ధర్మాలను, కుటుంబ ధర్మాలను, సామాజిక ధర్మాలను, మానవతా ధర్మాలను,
ప్రాకృతిక ధర్మాలను, కాల ధర్మాలను విశదీకరించి, విపులీకరించి - సకల, సద్విధ, సాత్విక భావాలు నింపి,
అంతర్ముఖుల గావించి, అంతర్మథనం కలిగించి, అంతరాత్మను దర్శింపజేసి, పరమాత్మాన్వేషణం చేసే సత్తా
కలుగ జేస్తారు. మానవ జీవిత సౌభాగ్యాన్ని సుసంపన్నం చేసుకుని, జన్మ సార్ధకత్వాన్ని సాధించ గలుగుతారు.
అందుకే ఈ మహాత్ముల వాక్యాలు మానవత్వ కావ్యాలనడంలో ఎంతమాత్రమూ సందియము లేదు.
నైతిక విలువలు పతనావస్థకు దిగజారకముందే తల్లి,దండ్రులు - తమ పిల్లలను బాల్యావస్థ నుండి, వారి నడవడికను
తీర్చిదిద్దాలి. మహాత్ముల వాక్యాలను విడమరచి చెప్పి, వారిని సత్ప్రవర్తనాపరులుగా తీర్చిదిద్దాలి. అదే మీ పిల్లలకు
మీరిచ్చే నిజమైన ఆస్థి. అదే తల్లి,దండ్రుల గురుతర బాధ్యత కూడా.

5, జులై 2009, ఆదివారం

మహాత్ములు - నైతిక విలువలు - 4.

మహాత్ములంటే . . . . .
దారి చూపే కరదీపికలు.
తిరుగులేని శాసన కర్తలు.
సమస్యల పరిష్కర్తలు.
చేయందించే అమృతహస్తాలు.
త్యాగాలకు నిలువెత్తు ప్రతిబింబాలు.
అటువంటి మహాత్ముల వాక్యాలు
సమస్త మానవాళికి
మానవత్వ కావ్యాలే మరి.
వారి మార్గదర్శకత్వంలో ...
మన జీవితాలను
దిశా నిర్దేశకత్వం
చేసుకుందాం...
వారి అనుభవాల
అమర పదాల
నన్వయించుకుంటూ...